మెడికల్ షాపు ముసుగులో మత్తు మందుల దందా!
• డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మాత్రలు, ఇంజెక్షన్ల విక్రయం... • 1,500 ట్యాపెంటడాల్ మాత్రలు స్వాధీనం.. నిర్వాహకుడు అరెస్ట్... • ఆరుగురు డెలివరీ బాయ్స్‌తో హోమ్ డెలివరీ నెట్వర్క్ నడిపినట్లు పోలీసుల గుర్తింపు...

మియాపూర్, ఆగస్టు 26: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులను విక్రయిస్తున్నారన్న సమాచారంతో మియాపూర్‌లోని బాలాజీ మెడికల్స్‌పై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఫార్మసీ నిర్వాహకుడు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఫార్మసీలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ట్యాపెంటడాల్ (Tapentadol) మాత్రలతో పాటు టెర్మిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. మొత్తం 60 బాక్సుల్లో ఉన్న 1,500 మత్తు మాత్రలతో పాటు పలు ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మత్తు మందులను కస్టమర్లకు నేరుగా చేరవేసేందుకు ప్రత్యేకంగా ఆరుగురు డెలివరీ బాయ్స్‌ను ఏర్పాటు చేసుకుని హోమ్ డెలివరీ నెట్వర్క్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ మందులు ఫార్మసీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రధాన సరఫరాదారులు ఎవరు? హోమ్ డెలివరీ ద్వారా ఎవరెవరికి విక్రయించారు? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి అక్రమ సరఫరా గొలుసును గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

