ఓవర్ స్పీడ్.. బైక్‌తో కారుపై నుంచి దూసుకెళ్లి యువకుడి మృతి
పమిడిముక్కల మండలం మంటాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... అదుపుతప్పి పార్క్ చేసిన కారుపైకి దూసుకెళ్లిన బైక్.. గాల్లోకి ఎగిరి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న యువకుడు... తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు...

కృష్ణా, ఆగస్టు 19: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. పమిడిముక్కల మండలం మంటాడ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పార్క్ చేసిన కారుపై నుంచి దూసుకెళ్లడంతో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
పామర్రుకు చెందిన దేవరకొండ రాజేష్ (20) బైక్‌పై నడుపుతుండగా మలుపు వద్ద అదుపుతప్పి ఎదురుగా పార్క్ చేసి ఉన్న కారుపైకి దూసుకెళ్లాడు. ప్రమాద తీవ్రతకు రాజేష్ గాల్లోకి ఎగిరి సమీపంలోని కరెంట్ స్తంభాన్ని ఢీకొన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

