సైబర్ మోసాలకు చెక్.. అందుబాటులోకి ప్రత్యేక యాప్
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాల నియంత్రణకు ‘సైబర్ సిటిజెన్’ యాప్... అనుమానాస్పద లింకులు, వెబ్సైట్లు, APK ఫైళ్లను చెక్ చేసుకునే అవకాశం... OTP, బ్యాంకు వివరాలు షేర్ చేసినా సైబర్ మిత్ర ద్వారా సత్వర సహాయం పొందే వెసులుబాటు...

విజయవాడ క్రైమ్, ఆగస్టు 19: పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాల నియంత్రణకు ‘సైబర్ సిటిజెన్’ పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది.
ఈ యాప్లో సైబర్ సిటిజెన్, సైబర్ మిత్ర, అవేర్నెస్ కంటెంట్, ఎనీబడీ కెన్ రిపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు ఉపయోగపడేలా యాప్ను రూపొందించారు.
అనుమానాస్పద లింకులు, వెబ్సైట్లు, APK ఫైళ్లను ఈ యాప్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వాటి ద్వారా ఎదురయ్యే సైబర్ ముప్పును ముందుగానే గుర్తించి అప్రమత్తం కావచ్చు.
OTP లేదా బ్యాంకు వివరాలు పొరపాటున ఇతరులతో పంచుకున్న సందర్భాల్లో ‘సైబర్ మిత్ర’ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు. అనుమానాస్పద లింకులు, నంబర్లను కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉండటంతో సైబర్ నేరాల నియంత్రణలో ఈ యాప్ ప్రజలకు ఉపయోగకరంగా మారనుంది.

