స్వాతంత్ర్య వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా సర్వం సిద్ధం
సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం... జాతీయ పతాకావిష్కరణలో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్.. జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం... ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు.. పటిష్ట బందోబస్తు...

V10TV విజయవాడ, ఆగస్టు 14: ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి శుక్రవారం ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు.
పెరేడ్ వాహనంలో ప్రయాణించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ రిహార్సల్స్‌ను ఆసాంతం వీక్షించారు. జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ బైక్ విన్యాసాలు, సిద్ధార్థ కళాశాల మహిళల డ్రమ్స్ ప్రదర్శన, పోలీస్ పెరేడ్, వందన స్వీకరణతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శనలను పరిశీలించారు. రిహార్సల్స్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి వేడుకలను తలపించేలా స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ప్రత్యేక శకటాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్ బైక్ విన్యాసాలు, డ్రమ్స్ ప్రదర్శన, వివిధ శాఖల పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేడుకలకు వచ్చే ప్రజలు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యాన్ చంద్ర, డీసీపీ కె.జి.వి. సరిత, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శీను, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

