శ్రావణ శోభతో ఇంద్రకీలాద్రి
తొలి శ్రావణ శుక్రవారం కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు.. వైభవంగా శ్రావణ మాస ఉత్సవాలు... పుష్పాలంకరణలో దుర్గమ్మ సన్నిధి.. ప్రత్యేక కుంకుమార్చనల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు... భక్తులకు త్వరితగతిన దర్శనం, తాగునీరు, అన్నప్రసాదాలపై ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
వీ10టీవీ , విజయవాడ, ఆగస్టు 14: శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సౌభాగ్యం, కుటుంబ క్షేమం కోసం ప్రత్యేక అర్చనలు చేసుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
పుష్పాలంకరణలో దుర్గమ్మ సన్నిధి
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు అమ్మవారి మూలవిరాట్, ఉపాలయాలు, అంతరాలయాలను రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సుగంధభరితమైన పూలతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. స్కానింగ్ పాయింట్ల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా క్యూ లైన్లు వేగంగా కదిలేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
ఆలయ పవిత్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని మొబైల్ ఫోన్ల విషయంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేశారు. భక్తులు ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు.
క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, పాలు తదితర సదుపాయాలు కల్పించడంతో పాటు అన్నప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులు, అర్చకులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తులకు ప్రశాంతంగా, సులభంగా అమ్మవారి దర్శనం కల్పించారు.

