నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
బ్యూటీషియన్ పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణ... బాధితురాలి ఫోన్ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రచురించిన నిందితుడు... సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేసిన ఉయ్యూరు టౌన్ పోలీసులు...

ఉయ్యూరు: మహిళ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి అసభ్యకర సందేశాలతో వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉయ్యూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉయ్యూరులో నివసించే పైలా జీవనజ్యోతి (28) బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాను అందించే బ్యూటీషియన్ సేవలను ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసుకుంటూ ఖాతాదారులను పెంచుకున్నారు.
ఈ నేపథ్యంలో స్థానికంగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న దాసరి రామకృష్ణ (32) బాధితురాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ ఖాతాల ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు బాధితురాలి ఫోన్ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రచురించి ఇబ్బందులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై బాధితురాలు ఉయ్యూరు టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా సైబర్ క్రైమ్ బృందం, ఉయ్యూరు సీఐ టీవీవీ రామారావు వేగంగా స్పందించి కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు.

