సోషల్ మీడియా స్నేహం.. ఇంటి నుంచి వెళ్లిన బాలిక
విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లిన బాలిక... తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... యువకుడితో ఉన్న బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత...

విజయవాడ: ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడిని కలిసేందుకు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లిన ఓ బాలికను పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, కంబాలచెరువు పార్కు వద్ద గస్తీ నిర్వహిస్తున్న శక్తి టీమ్ సిబ్బంది యువకుడితో ఉన్న బాలికను గుర్తించారు. విచారణలో తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిసింది.
బాలిక అదృశ్యంపై అప్పటికే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో బాలికను సురక్షితంగా వారి వద్దకు చేర్చారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే అపరిచిత పరిచయాల విషయంలో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహనతో వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

