పాదయాత్రకు సిద్ధమవుతున్న జగన్
వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో ప్రారంభించే యోచన... నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వెల్లడించిన వైసీపీ అధినేత... స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సూచనలు...

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో పాదయాత్ర ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడంపై జగన్ దృష్టి సారించినట్లు సమావేశంలో వెల్లడైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు ఆయన పలు సూచనలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో సిద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది చేపట్టనున్న పాదయాత్ర ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

