26 మంది గర్భిణీలకు ఉచిత గుండె పరీక్షలు
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్టినగర్‌లో వైద్య శిబిరం వరుసగా నాలుగో మంగళవారం కొనసాగిన ఉచిత సేవలు గర్భిణీలకు వైద్య పరీక్షలతోపాటు ప్రసవ జాగ్రత్తలపై అవగాహన

విజయవాడ, సెప్టెంబర్ 1: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ గర్భిణీల కోసం నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ 2డీ ఎకో ఆరోగ్య పరీక్షల శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టినగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వరుసగా నాలుగో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన శిబిరంలో మొత్తం 26 మంది గర్భిణీలకు 2డీ ఎకో, మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సమయంలో తల్లి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు, గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి ప్రసవ సమయంలో తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని వైద్యులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణీల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సుజనా ఫౌండేషన్ ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక పరీక్షలను అందిస్తోంది. డాక్టర్ విజయసుధ, 2డీ ఎకో టెక్నీషియన్ కుసుమ వైద్య సేవలు అందించారు. గర్భిణీలు ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలపై సూచనలు చేశారు. శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు నాగోతి రామారావు, వేంపలి గౌరీశంకర్ తదితరులు సేవలందించారు.

