కేసరపల్లి అభివృద్ధికి రూ.8.72 కోట్లు
‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’లో ఇంటింటికీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ దుర్గాపురంలో రూ.10.03 లక్షల తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం రూ.38.07 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు ప్రజలకు అంకితం



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కేసరపల్లి: ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కేసరపల్లి పంచాయతీ పరిధిలోని దుర్గాపురం, చెంచుల కాలనీల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న ఆయన, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పథకాలు, గ్రామంలో చేపట్టిన పనులతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్నామని, తమ పనితీరును ప్రజలే అంచనా వేస్తారని అన్నారు. కేసరపల్లి గ్రామంలో ఇప్పటివరకు సుమారు రూ.8.72 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో గ్రామంలో కనీసం రూ.కోటి విలువైన పనులు కూడా జరగలేదని విమర్శించారు. సుమారు రూ.2.50 కోట్లతో నిర్మించిన సచివాలయ భవనంలో హెచ్సీఎల్ ఫౌండేషన్ సహకారంతో యువతకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి ఉద్యోగ


అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమన్నారు. ఈ కేంద్రంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కేసరపల్లిలోని 12,779 మంది జనాభాలో ఇప్పటివరకు 10,206 మందికి ఇంటింటికీ వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేసరపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని త్వరలో పునరుద్ధరించి రైతులకు రుణాలు, ఇతర సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దుర్గాపురంలో హెచ్సీఎల్ ఫౌండేషన్ సహకారంతో రూ.10.03 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని యార్లగడ్డ ప్రారంభించారు. గంటకు రెండు వేల లీటర్ల నీటిని శుద్ధి చేయగల ఈ కేంద్రం ద్వారా రోజుకు సుమారు 500 మందికి సురక్షిత తాగునీరు అందనుంది. అనంతరం దుర్గాపురంలో రూ.38.07 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. సుందరయ్య కాలనీలో సీసీ డ్రెయిన్, విజేత పాఠశాల వద్ద అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

