ఫ్లైఓవర్లతో గుడివాడ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం
భీమవరం, మచిలీపట్నం రైల్వే గేట్ల వద్ద నిర్మాణ పనులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష గేట్ల మూసివేతకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలు, సర్వీస్ రోడ్లు సిద్ధం చేయాలని ఆదేశం డిసెంబర్ నాటికి భీమవరం ఫ్లైఓవర్ ఒకవైపు రాకపోకలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యం రైల్వే అనుమతుల ప్రక్రియ వేగవంతానికి ఎంపీ బాలశౌరి సహకారంతో కృషి

గుడివాడ, సెప్టెంబర్ 1 (వీ10 టీవీ): గుడివాడ పట్టణంలోని భీమవరం, మచిలీపట్నం రైల్వే గేట్ల వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణ పనులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం ప్రజావేదిక కార్యాలయంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పోలీసు శాఖల అధికారులతో సమావేశమై పనుల పురోగతి, ట్రాఫిక్ మళ్లింపు, సర్వీస్ రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. జిల్లా కలెక్టర్ నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. మచిలీపట్నం రైల్వే గేటు వద్ద సుమారు 70 మీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నందున గేటును తాత్కాలికంగా మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. గేట్ల మూసివేతకు ముందే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. భీమవరం గేటు వద్ద పనులు ప్రారంభించేలోపే సర్వీస్ రోడ్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రైల్వే, మున్సిపల్, పోలీసు, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ అనుమతులు వచ్చిన వెంటనే బైపాస్ రోడ్డులో పనులకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని జాతీయ రహదారుల అధికారులు తెలిపారు. ఫ్లైఓవర్‌కు అవసరమైన గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, డిసెంబర్ నాటికి భీమవరం ఫ్లైఓవర్లో ఒకవైపు రాకపోకలను ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, డబుల్ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గూడ్స్ రైళ్ల రాకపోకలు పెరిగి భీమవరం గేటు వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రమైందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బంటుమిల్లి రోడ్డు వైపు బైపాస్‌లో చేపడుతున్న కల్వర్టు పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైల్వే శాఖకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను ఎంపీ వల్లభనేని బాలశౌరి సహకారంతో వేగవంతం చేస్తున్నామన్నారు. నిర్మాణ సమయంలో ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా, భవిష్యత్తులో గుడివాడ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.

