దేశ రాజధానిలో దేవాలయాల అభివృద్ధికి అడుగులు
ఏపీ భవన్‌లోని పురాతన శివాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ నిత్య కైంకర్యాలకు ఆటంకం లేకుండా తక్షణ చర్యలు.. అర్చకుడికి అదనపు బాధ్యతలు కనకదుర్గమ్మ మందిరం మరింత అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల పురాతన శివాలయంతో పాటు శ్రీ కనకదుర్గాదేవి మందిరాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. న్యూఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయ సూచనలు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఏపీ భవన్ ఎస్టేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పురాతన శివాలయాన్ని ఈవో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిత్య పూజలు, అర్చనాది కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. చాలా సంవత్సరాలుగా అనధికారిక వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ పురాతన శివాలయం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ భవన్ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో, ఆలయంలో నిత్య కైంకర్యాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంద్రకీలాద్రి దేవస్థానం తక్షణ చర్యలు చేపట్టిందని ఈవో శీనా నాయక్ తెలిపారు. శివాలయానికి నూతన శాశ్వత అర్చకుడిని నియమించే వరకు ఏపీ భవన్‌లోని శ్రీ కనకదుర్గాదేవి మందిరంలో అర్చక విధులు నిర్వహిస్తున్న అర్చక స్వామికి శివాలయంలో నిత్య కైంకర్యాల నిర్వహణకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. పూజా ద్రవ్యాలు, ఇతర అవసరమైన సామగ్రిని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం సమకూరుస్తుందని తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా శివాలయంలో పూజాదికాలు నిర్వహించేందుకు దేవస్థానం వైదిక కమిటీ, స్థానాచార్యుల అభిప్రాయాలు, సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఈవో పేర్కొన్నారు. అనంతరం ఏపీ భవన్ ప్రాంగణంలో ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గాదేవి మందిరాన్ని ఈవో దర్శించుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. దేశ రాజధానిలో కొలువైన కనకదుర్గమ్మ మందిరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్‌కు పూర్తి వివరాలు తెలియజేసి, వారి మార్గదర్శకత్వంలో అభివృద్ధి కార్యాచరణను ప్రారంభిస్తామని శీనా నాయక్ వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఢిల్లీ ఏపీ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

