శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 45 సార్లు బాంబు బెదిరింపులు!
చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ సుబ్రహ్మణ్యం అరెస్ట్.... దేశవ్యాప్తంగా 800 వరకు నకిలీ బాంబు బెదిరింపు మెయిల్స్... డీఎంకే నేతలపై వ్యతిరేకతతోనే బెదిరింపులు పంపినట్లు పోలీసుల వెల్లడి...

హైదరాబాద్, అక్టోబర్ 27: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన కేసులో చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ సుబ్రహ్మణ్యాన్ని ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. 2025–2026 మధ్యకాలంలో శంషాబాద్ విమానాశ్రయానికి సుమారు 45 సార్లు నకిలీ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సుమారు 700 నుంచి 800 వరకు బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. తమిళనాడులోని డీఎంకే నాయకులపై పెంచుకున్న వ్యతిరేకతతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే ఉద్దేశంతో నకిలీ ఈమెయిల్ ఖాతాలను సృష్టించి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత ఒత్తిడి కూడా ఇందుకు కారణమని విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. నిందితుడి ప్రమేయం ఉన్న ఇతర కేసులపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

