సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై బోల్తా పడిన వాటర్ ట్యాంకర్
రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం... పీక్ అవర్స్‌లోనూ ట్రాఫిక్ స్తంభించకుండా పోలీసుల చర్యలు... సమయస్ఫూర్తితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన సీఐ ప్రభాకర్, ఎస్సై కృష్ణ...

విజయవాడ, సెప్టెంబరు 9: సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం వాటర్ ట్యాంకర్ బోల్తా పడటంతో కొద్దిసేపు కలకలం నెలకొంది. కార్యాలయాలు, విధులకు వెళ్లే సమయం కావడంతో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి తప్పింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్లైఓవర్‌పై ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్‌లో ఎదురుగా రావడంతో అతడిని తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ డ్రైవర్ అదుపు కోల్పోయాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న వాటర్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడినట్లు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ సీఐ ప్రభాకర్, ఎస్సై కృష్ణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకవైపు ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించే చర్యలు చేపడుతూనే, మరోవైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అవసరమైన చోట వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తూ ఫ్లైఓవర్‌పై భారీగా వాహనాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు.
పీక్ అవర్స్‌లో జరిగిన ప్రమాదం కావడంతో ఏమాత్రం ఆలస్యమైనా ఫ్లైఓవర్‌తో పాటు పరిసర రహదారుల్లో భారీ ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండేది. అయితే పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిస్థితిని త్వరగా చక్కదిద్దారు. ప్రమాద సమయంలో వేగంగా స్పందించి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన సీఐ ప్రభాకర్, ఎస్సై కృష్ణతో పాటు ట్రాఫిక్ సిబ్బందిని స్థానికులు, వాహనదారులు అభినందించారు.
