బంగాళాఖాతంలో తుపాను ముప్పు.. ఉత్తరాంధ్ర తీరానికి హెచ్చరిక!
హెచ్చరిక! నేడు వాయుగుండంగా.. రేపు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం… ఈ నెల 26 నాటికి తుపానుగా బలపడనున్న అల్పపీడనం… ఉత్తరాంధ్ర తీరంలో భారీ వర్షాల సూచన.. మత్స్యకారులు అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడవచ్చని అంచనా వేసింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

