ఎల్బ్రస్‌పై త్రివర్ణ పతాకం.. ఏలూరు ఎస్‌ఐ సాహస ఘనత
5,642 మీటర్ల ఎత్తుకు చేరుకుని 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన... జాతీయ గీతంతో దేశభక్తిని చాటిన ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు.. పోలీసు అమరవీరులకు సాహస యాత్ర అంకితం.. ఉన్నతాధికారుల అభినందనలు...

ఏలూరు, ఆగస్టు 14 (V10TV): దేశభక్తికి సాహసాన్ని జోడించి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణుల్లో ఉన్న మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించి, 5,642 మీటర్ల ఎత్తులో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను శిఖరంపై ప్రదర్శించి దేశభక్తిని చాటిచెప్పారు.
మంచు పర్వతాన్ని అధిరోహించడం సాధారణ సాహసం కాదని, తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక ఎత్తు, శారీరక ఒత్తిడి వంటి అనేక సవాళ్లను అధిగమించి వెంకటేశ్వరరావు ఈ ఘనతను సాధించారని అధికారులు తెలిపారు. గతంలో 78 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించిన ఆయన, ఈసారి దానిని 100 మీటర్లకు పెంచాలనే సంకల్పంతో ముందుకు సాగడం ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.
మౌంట్ ఎల్బ్రస్ శిఖరంపై భారత జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన క్షణం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపే ఘట్టంగా నిలిచింది. భారతదేశ గౌరవం ఎక్కడికైనా, ఎంత ఎత్తుకైనా చేరుతుందనే స్ఫూర్తిదాయక సందేశాన్ని ఈ సాహసం ప్రపంచానికి చాటిచెప్పింది.
పోలీసు శాఖలో క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదల, సేవాభావంతో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని వెంకటేశ్వరరావు సాహస యాత్ర నిరూపించిందని ఉన్నతాధికారులు అభినందించారు. తన సాహస ఘనతను దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు అంకితం చేయడం ద్వారా పోలీసు కుటుంబం, దేశ రక్షణ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు.
మంచు కొండలపై అడుగులు వేసింది ఒక్క వ్యక్తి కాదని.. ఆ శిఖరాగ్రంపై రెపరెపలాడింది కోట్లాది భారతీయుల గర్వమని అధికారులు పేర్కొన్నారు. ఎల్బ్రస్‌పై త్రివర్ణ పతాకం ఎగిరిన ఆ క్షణం భారతదేశ గౌరవం ప్రపంచ శిఖరాన్ని తాకిన క్షణంగా అభివర్ణించారు.

