రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
మోపిదేవి మండలంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ మేళ్లమర్తిలంకలో 296, నాగాయతిప్పలో 391 మందికి అందజేత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడొద్దు: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
మోపిదేవి, సెప్టెంబర్ 3: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మోపిదేవి మండలంలో గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. తహసీల్దార్ ఎస్.భవానీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేళ్లమర్తిలంకలో 296, నాగాయతిప్పలో 391 పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం ద్వారా నియోజకవర్గంలోని 30,871 మంది రైతులకు రూ.59.18 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తూ డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోందని తెలిపారు. ‘పల్లె పండుగ–1’లో సీసీ రోడ్లు, ‘పల్లె పండుగ–2’లో తారు రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ‘పల్లె పండుగ–3’లో రైతులకు ఉపయోగపడే డొంక రోడ్ల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి తగినంత నీరు రావడం లేదని ఎమ్మెల్యే చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందుతుండటంతో కృష్ణా డెల్టా రైతులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ రైతులు అధైర్యపడవద్దని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి పెనుమూడి సాయిబాబు, తెదేపా మండల అధ్యక్షుడు నడకుదుటి జనార్ధన్‌రావు, ఉప ఎంపీపీ నడకుదుటి జననీ కుమారి, సొసైటీ ఛైర్మన్ బళ్ళ సీతారాం ప్రసాద్, మాజీ సర్పంచ్ వేములపల్లి రవిచంద్ర, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుప్పాల ఏసు, జనసేన నాయకుడు కూరేటి రాఘవ, వీఆర్వో పసుపులేటి వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

