ఎస్ఈసీ కార్యాలయం ఎదుట వైసీపీ నిరసన సెగ!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు అనుమతి నిరాకరణతో నిరసన... కార్యాలయం కిందనే నేలపై కూర్చొని ఆందోళన చేపట్టిన వైసీపీ నాయకులు... కమిషనర్‌ను కలిసే వరకు కదిలేది లేదని స్పష్టం చేసిన నేతలు...

విజయవాడ, అక్టోబర్ 22: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో పలువురు వైసీపీ నాయకులు కార్యాలయం కింద నేలపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం ఉండాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌ను కలిసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని, వాటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తమ ఫిర్యాదులను స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకుల బైఠాయింపుతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

