సైబర్ నేరగాళ్ల వలలో పడకండి: ఏసీపీ దామోదర్
మ్యాట్రిమోనీ యాప్‌లు, వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో మోసాలు ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు వసూలు చేసే వారితో అప్రమత్తం ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో వచ్చే ఆఫర్లను గుడ్డిగా నమ్మొద్దని సూచన

విజయవాడ క్రైమ్ ఆగస్టు 17 : సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. ముఖ్యంగా మ్యాట్రిమోనీ యాప్‌లు, వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
ప్రేమ, పెళ్లి పేరుతో పరిచయం పెంచుకుని నమ్మకం కలిగించిన తర్వాత వివిధ కారణాలు చెప్పి డబ్బులు అడిగే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల వివరాలను పూర్తిగా నిర్ధారించుకోకుండా నగదు బదిలీ చేయడం, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవడం చేయరాదని సూచించారు.
అదేవిధంగా అధిక లాభాలు వస్తాయంటూ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్లైన్ వేదికల ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని ఏసీపీ దామోదర్ సూచించారు. సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు అనుమానాస్పద లింకులు, అపరిచితుల ఆర్థిక ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు.

