తడిసిన దేహం.. చెదరని కర్తవ్యం
జోరు వర్షంలోనూ రహదారులపైనే విధులు స్తంభించిన వాహనాల రాకపోకలు.. నియంత్రణకు చెమటోడుస్తున్న సిబ్బంది దసరా ఉత్సవాల నేపథ్యంలో శాశ్వత కార్యాచరణ అవసరం

విజయవాడ: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం కురిసిన వర్షంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఓవైపు జోరుగా వర్షం కురుస్తున్నా ట్రాఫిక్ పోలీసులు తడుస్తూనే రహదారులపై నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. వర్షపు నీరు నిలిచిపోవడం, రహదారులు ఇరుకుగా మారడం, ఆక్రమణలు, అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం, సిగ్నళ్ల వద్ద వాహనాల రద్దీ పెరగడం వంటి సమస్యలు ట్రాఫిక్ నియంత్రణకు సవాలుగా మారుతున్నాయి. అయితే వీటన్నింటి భారం చివరకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందిపైనే పడుతోంది. వానలో రక్షణేదీ..? వర్షంలో విధులు నిర్వహించే సిబ్బందికి నాణ్యమైన వర్షపు దుస్తులు, నీరు చొరబడని బూట్లు, కూడళ్ల వద్ద తాత్కాలిక రక్షణ కేంద్రాలు, సమాచార పరికరాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. గంటల తరబడి వర్షంలో నిలబడటం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడినీ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. మూల సమస్యలపై దృష్టేదీ..? ట్రాఫిక్ సమస్య తలెత్తిన ప్రతిసారీ పోలీసు సిబ్బందిని రోడ్డుపై నిలబెట్టడం ఒక్కటే పరిష్కారం కాదు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించడం, ఆక్రమణలు తొలగించడం, వాహనాల నిలుపుదలను నియంత్రించడం, సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచడం, ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. పోలీసు, నగరపాలక సంస్థ, రహదారులు–భవనాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో వ్యవహరిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దసరాకు ముందే మేల్కోవాలి నగరంలో ప్రముఖుల పర్యటనలు, పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ పోలీసులపై అదనపు భారం పడుతోంది. త్వరలో జరగనున్న దసరా ఉత్సవాల సందర్భంగా పది రోజులపాటు లక్షలాది మంది భక్తులు నగరానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగానే సమగ్ర ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలి. క్షేత్రస్థాయి సిబ్బందికి అదనపు బలగాలు, విశ్రాంతి సమయం, భోజనం, తాగునీరు, వర్ష రక్షణ పరికరాలు అందించాలి. ట్రాఫిక్‌ను చక్కదిద్దే పోలీసుల కష్టాలను చూసి వదిలేయకుండా.. సమస్యకు కారణమైన లోపాలను సరిదిద్దడమే పాలకుల బాధ్యత.

