చెంచుల కాలనీ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
కొద్దిపాటి వర్షానికే రోడ్లు, ఇళ్లలోకి చేరుతున్న మురుగునీరు డ్రైనేజీ పూడ్చివేతతోనే సమస్య తీవ్రం.. అధికారులతో పరిశీలన జరపాలి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తాం: జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి

గన్నవరం: గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెంచుల కాలనీలో ఏళ్లుగా నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గన్నవరం మండలం జెడ్పీటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి డిమాండ్ చేశారు. కొద్దిపాటి వర్షం కురిసినా చెంచుల కాలనీలో డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి మురుగునీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పత్రికల్లో వార్తలు రావడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎలిజబెత్ రాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం పట్టణ అధ్యక్షుడు మోదుగుమూడి వెంకటేశ్వరరావు, గన్నవరం మాజీ వార్డు సభ్యుడు లుక్కా ప్రసాద్ తదితరులు కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. కాలనీ పక్కనే ఏర్పాటు చేసిన వెంచర్ల కారణంగా డ్రైనేజీ మార్గాలు పూడుకుపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు ఎలిజబెత్ రాణి తెలిపారు. సమీపంలోని తోడిపాడి చెరువు నిండటం కూడా సమస్య తీవ్రతకు కారణమవుతోందన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందిస్తామని, సంబంధిత జిల్లా అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి శాశ్వత పరిష్కార పనులు చేపట్టాలని కోరతామని తెలిపారు. స్థానిక అధికారుల దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్తామన్నారు. మురుగునీరు ఇళ్లలోకి చేరడం, నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి మలేరియా, డయేరియా తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసరపల్లి గ్రామ పంచాయతీ సరిహద్దు ప్రాంతం కావడంతో పనుల విషయంలో కొంత నిర్లక్ష్యం జరుగుతోందని, జిల్లా అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఎలిజబెత్ రాణి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరెడ్డి మణిమ్మ, మోదుగుమూడి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

