‘సుజనా ఫౌండేషన్’ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు... కంటి పరీక్షల నుంచి ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్రే వరకు ఉచిత పరీక్షలు... 103 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ పశ్చిమ: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ‘సుజనా ఫౌండేషన్’ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. 47వ డివిజన్ సర్కిల్ వన్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. శిబిరంలో కంటి పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్రే, బీపీ, షుగర్ తదితర పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్లు వైద్య సేవలు అందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో 103 మందికి నిపుణులైన వైద్యుల బృందం పరీక్షలు

నిర్వహించి అవసరమైన చికిత్స సూచనలు చేసింది. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి శని, ఆదివారాల్లో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు నాగోతి రామారావు, వెంపలి గౌరీశంకర్, ఆకారపు విజయకుమారి, పోతినీడి లోకేష్, పగిడిపల్లి ప్రభుచరణ్, చొక్కర పాపారావు, కోటేశ్వరరావు, అమరావతి ఐ హాస్పిటల్, పీవీఆర్ హాస్పిటల్స్ వైద్యులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు సేవలందించారు.

