కోనేరు ఆక్రమణల తొలగింపులో జాప్యం.. హిందూ సంఘాల నిరాహార దీక్ష
కోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్... ఆక్రమణలు తొలగించి దేవాదాయ శాఖకు అప్పగించాలి... మూడు రోజుల్లో చర్యలేకపోతే ఆమరణ దీక్షలకు హెచ్చరిక...

నందిగామ, సెప్టెంబరు 7: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన సోమేశ్వర స్వామి పుష్కరిణి (కోనేరు)పై ఉన్న ఆక్రమణలను తొలగించే విషయంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారంటూ హిందూ ధార్మిక సంఘాలు సోమవారం శివాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టాయి.
కోనేరుకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమణల నుంచి విముక్తి చేసి దేవాదాయ శాఖకు అప్పగించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే నిరసనకు దిగామని హిందూ సంఘాల నాయకులు తెలిపారు. తొలుత మూడు రోజులపాటు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని, ఈలోగా కోనేరు ఆక్రమణలను తొలగించి దేవస్థానానికి స్వాధీనం చేయకపోతే తదుపరి సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

