కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం
పశ్చిమలో 22 డివిజన్లలో కూటమి జెండా ఎగరాలి... ‘ఇంటింటికీ టీడీపీ’లో పశ్చిమను నంబర్ వన్‌గా నిలపాలి... నా రాజకీయ తొలి అడుగు బుద్ధా వెంకన్నతోనే: ఎంపీ కేశినేని చిన్ని...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ పశ్చిమ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని మొదటి స్థానానికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధా వెంకన్న మామిడి తోటలో నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో బుద్ధా వెంకన్న నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో తొలి అడుగు బుద్ధా వెంకన్నతోనే పడిందని గుర్తుచేసుకున్నారు. ‘‘నా చేయి పట్టుకుని నడిపించి ప్రజలకు చేరువ చేసిన వ్యక్తి వెంకన్న. ఆయన నాకు సోదరుడితో సమానం’’ అని పేర్కొన్నారు. పార్టీ కోసం పదవులతో సంబంధం లేకుండా నిబద్ధతతో పనిచేసే నాయకుడు బుద్ధా వెంకన్న అని కొనియాడారు. రానున్న స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని

చిన్ని కోరారు. ప్రతి డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు షరీఫ్ మాట్లాడుతూ బుద్ధా వెంకన్న పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయన పనితీరుపై నమ్మకంతోనే అధిష్ఠానం పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన ఐదుగురు డివిజన్ అధ్యక్షులను సమావేశంలో సత్కరించారు. వారికి బుద్ధా వెంకన్న వ్యక్తిగతంగా రూ.1,74,600 నగదు పురస్కారం అందజేశారు. పార్టీ కోసం అవసరమైతే నాలుగడుగులు వెనక్కి తగ్గుతానని, పార్టీ బలోపేతం కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, షరీఫ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, గద్దె అనురాధ, పట్టాభి, నాగుల్‌మీరా, కోగంటి రామారావు, ప్రత్తిపాటి శ్రీధర్, బోండా సిద్ధార్థ, గొట్టిముక్కల రఘు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

