కానుమోలు అభివృద్ధికి మరో రూ.2.20 కోట్లు
రూ.12 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరంలో 450 మందికి ఇళ్ల పట్టాలు.. మరో 500-600 మంది అర్హులకు త్వరలో పంపిణీ డీఎస్సీ, పెట్టుబడులు, నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం: బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కానుమోలులో ఇప్పటికే రూ.67 లక్షల విలువైన రోడ్డు పనులు పూర్తి చేశామని, గ్రామ అభివృద్ధికి అదనంగా రూ.2.20 కోట్ల పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. జీవో-30 ద్వారా ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివసిస్తున్న అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. గన్నవరం మండలంలో ఇప్పటికే 450 మందికి పట్టాలు పంపిణీ చేశామని, కొత్తపల్లిలో మరో 196 పట్టాలు

సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 341 మందికి పొజెషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని, త్వరలో మరో 500 నుంచి 600 మంది అర్హులకు పట్టాలు అందిస్తామని వెల్లడించారు. డీఎస్సీపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను యార్లగడ్డ ఖండించారు. ఆరోపణలు చేసే వారు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, డీఎస్సీ, పెట్టుబడులు, ఉద్యోగాలు, గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి సహా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపులు తన విధానం కాదని, ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. గత పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుతం జరుగుతున్న పనులను ప్రజలే పోల్చి చూడాలని కోరారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

