ఈద్ మిలాద్ దావత్లో వెల్లివిరిసిన సోదరభావం
వించిపేటలో ఘనంగా జష్నే ఈద్-మిలాద్-ఉన్-నబీ దావత్... . ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు... ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించి ఆప్యాయత...

విజయవాడ, ఆగస్టు 26: మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, దాతృత్వం, సమానత్వం సమాజానికి ఆదర్శమని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
విజయవాడ వించిపేటలోని జెండా చెట్టు సెంటర్ వద్ద మహబూబ్ సుభాని జెండా చెట్టు దర్గా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ‘జష్నే ఈద్-మిలాద్-ఉన్-నబీ కే దావత్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు, నిర్వాహకుడు షేక్ హుస్సేన్ భాషా (భాషి), స్థానిక ముస్లిం సోదరులు వెలంపల్లికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన ముస్లిం సోదరులకు ఈద్-మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దావత్లో పాల్గొన్న వారికి స్వయంగా విందు భోజనం వడ్డించి ఆప్యాయతను చాటుకున్నారు.
వెలంపల్లి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈద్-మిలాద్-ఉన్-నబీ పవిత్రమైన పర్వదినమన్నారు. ప్రవక్త బోధించిన కరుణ, శాంతి, దాతృత్వం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడమే ప్రవక్త చూపిన నిజమైన మార్గమని చెప్పారు.
సమాజంలో మతసామరస్యం, సోదరభావం మరింత వెల్లివిరియాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మహబూబ్ సుభాని జెండా చెట్టు దర్గా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

