నిత్యావసర ధరలపై కూటమి నేతలను నిలదీయాలి!
సామాన్యులపై ధరల భారం.. కుటుంబ పోషణ కష్టతరం... చేతివృత్తులకు పనుల్లేక కార్మికుల జీవనం దుర్భరం... ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం: తోలేటి శ్రీకాంత్...

విజయవాడ, అక్టోబర్ 27: కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్న కూటమి నాయకులను ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 50వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎండీ అప్సర్, 40వ డివిజన్ అభ్యర్థి అల్లం భువన్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్‌తో కలిసి తోలేటి శ్రీకాంత్ ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. మరోవైపు చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు తగినంత పనులు లభించక ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం అంతంతమాత్రంగా ఉండగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు. అభివృద్ధి పనులు కుంటుపడటంతో పాటు అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పెరిగిన ధరల నియంత్రణ, నిలిచిపోయిన అభివృద్ధి పనులపై ప్రజలకు కూటమి నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికీ వచ్చే కూటమి అభ్యర్థులను ఆయా సమస్యలపై ప్రశ్నించాలని సూచించారు. బీసీల రాజకీయ సాధికారతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యత ఇస్తోందని శ్రీకాంత్ పేర్కొన్నారు. అందులో భాగంగానే బీసీ మహిళ రాయన భాగ్యలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిపిందన్నారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో పాటు 50వ డివిజన్ అభ్యర్థి ఎండీ అప్సర్, 40వ డివిజన్ అభ్యర్థి అల్లం భువన్ కుమార్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

