భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం!
సిమెంట్ మిశ్రమం తరలిస్తున్న లిఫ్ట్ రోప్ తెగి కార్మికులకు తీవ్ర గాయాలు… మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం… ప్రమాదానికి భద్రతా లోపాలే కారణమా?.. సమగ్ర విచారణకు డిమాండ్…

మణుగూరు, అక్టోబర్ 25: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం కార్మిక వర్గాల్లో కలకలం రేపింది. కేంద్రంలోని సిస్కన్ సంస్థకు చెందిన డీ వాటరింగ్ ప్లాంట్ వద్ద సివిల్ పనులు నిర్వహిస్తుండగా సిమెంట్ మిశ్రమాన్ని తరలించే లిఫ్ట్ రోప్ ఒక్కసారిగా తెగి కార్మికులను తాకినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు మృతి చెందినట్లు తెలిసింది. గాయపడిన మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఉన్నాయా? లిఫ్ట్ రోప్ సామర్థ్యాన్ని ముందుగానే పరిశీలించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ కేంద్రంలో నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్ట్ సంస్థలు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. మృతుడి పూర్తి వివరాలు, గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

