పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ గుణ్ణం రామకృష్ణ
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రతా చర్యలు… సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా.. సీసీ కెమెరాలు, బారికేడింగ్కు ఆదేశాలు… ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు…

విజయవాడ, అక్టోబర్ 25: విజయవాడ నగరంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం డీసీపీ గుణ్ణం రామకృష్ణ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట కొత్తపేట సీఐ కొండలరావు, స్టేషన్ ఎస్ఐలు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల రాకపోకలకు అనువైన పరిస్థితులు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలను డీసీపీ పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ఠ బందోబస్తు కల్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని డీసీపీ గుణ్ణం రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

