మద్యం మత్తులో లారీ డ్రైవింగ్.. 10 రోజులు జైలు!
బ్రీత్ అనలైజర్‌లో ఏకంగా 568 mg/100 ml నమోదు... కంటైనర్ లారీని ప్రమాదకరంగా నడిపిన డ్రైవర్‌పై కేసు... 10 రోజుల జైలుతో పాటు రూ.12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు...

తిరుపతి, ఆగస్టు 27: మద్యం మత్తులో కంటైనర్ లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన డ్రైవర్‌కు నాయుడుపేట కోర్టు 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
చెన్నై నుంచి నెల్లూరు వైపు జాతీయ రహదారిపై TN-88-J-2370 నంబరు కంటైనర్ లారీని డ్రైవర్ తియగరాజన్ నడుపుతూ మల్లాం జంక్షన్ సమీపంలో ప్రమాదకరంగా వెళ్తున్నట్లు డయల్-112కు సమాచారం అందింది.
వెంటనే నాయుడుపేట ఎస్‌ఐ ఎం. శివశంకర్ రావు, బీట్ సిబ్బంది లారీని అడ్డుకుని డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో 568 mg/100 ml ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
దీంతో మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధించారు.
మద్యం సేవించి వాహనం నడిపేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా డ్రైవర్ తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాడని పేర్కొన్నారు.
‘‘వేగం కంటే ప్రాణం విలువైనది.. మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్న కుటుంబాన్ని గుర్తుంచుకోండి. మద్యం సేవించి వాహనం నడపవద్దు’’ అని జిల్లా పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

