సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐ చేతికి!
హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి కేసు రికార్డులు అందజేసిన సిట్ అధికారులు... ఎఫ్ఐఆర్, చార్జిషీట్, డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల అప్పగింత... విజయవాడలో దర్యాప్తునకు రంగంలోకి సీబీఐ బృందం...

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హైదరాబాద్లోని సీబీఐ జోనల్ కార్యాలయానికి వెళ్లి ఇప్పటివరకు సేకరించిన కేసు రికార్డులను అందజేసినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, కేసు డైరీలను అప్పగించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నెల 16న హైకోర్టు సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారం నాలుగు వారాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కూడా స్పష్టం చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణపై కస్టోడియల్ హింస జరిగినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో పోలీసుల పాత్ర, మృతదేహాన్ని మాయం చేసినట్లు వచ్చిన ఆరోపణలు, ఆధారాల తారుమారు వంటి అంశాలు సీబీఐ దర్యాప్తులో కీలకం కానున్నాయి. శుక్రవారం సీబీఐ బృందం విజయవాడకు రానున్నట్లు సమాచారం. గతంలో సిట్ సేకరించిన ఆధారాలతో పాటు సాయికృష్ణ మృతికి దారితీసిన పరిస్థితులు, ఘటనలో ప్రమేయం ఉన్నవారి పాత్రపై దర్యాప్తు చేపట్టే అవకాశముంది.

