పోలీస్ ఉద్యోగాల భర్తీపై జగన్కు నిరుద్యోగ యువత వినతి
కనీసం 10 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ ▪️ అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి ▪️ నిరుద్యోగులకు అండగా ఉంటామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ హామీ

తాడేపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం కలిశారు. పోలీస్ శాఖలో సుమారు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కనీసం 10 వేల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అలాగే పోలీస్ నియామకాల అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నప్పటికీ 2022 తర్వాత కొత్త నోటిఫికేషన్ విడుదల కాలేదని, దీంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని జేఏసీ ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం ఆలస్యం చేసిన కారణంగా అభ్యర్థులు నష్టపోకుండా వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రతినిధుల వినతిని విన్న వైఎస్ జగన్.. నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, పోలీస్ ఉద్యోగాల భర్తీతో పాటు వయోపరిమితి పెంపు అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

