పంచాయతీలకు గత ప్రభుత్వం రూ.12 వేల కోట్ల నిధులు దారి మళ్లించింది: యార్లగడ్డ
కూటమి వచ్చాక పంచాయతీలకు రూ.4,200 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల... 13,325 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించడం చారిత్రాత్మకం... రిజిస్ట్రేషన్, సీఆర్‌డీఏ వాటా నిధులు పంచాయతీలకు అందేలా చర్యలు తీసుకోవాలని సభలో డిమాండ్...

అమరావతి, ఆగస్టు 20: గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరిచిందని, కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన నిధుల్లో రూ.12 వేల కోట్లను దారి మళ్లించిందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా అనేక సంస్కరణలు చేపట్టిందని పేర్కొన్నారు.
శాసనసభలో పంచాయతీరాజ్ వ్యవస్థపై జరిగిన చర్చలో యార్లగడ్డ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మండల పరిషత్‌లలో ఇద్దరు ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్‌లలో ఇద్దరు ఉపాధ్యక్షుల పదవులను ఏర్పాటు చేశారని, వాటివల్ల పరిపాలనాపరంగా ఆశించిన ప్రయోజనం కలగలేదన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఒక్కో ఉపాధ్యక్షుడు ఉండేలా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం పంచాయతీలకు ప్రాధాన్యం ఇస్తోందనడానికి రాష్ట్రవ్యాప్తంగా 13,325 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించడమే నిదర్శనమన్నారు. సర్పంచుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.4,200 కోట్ల నిధులను విడుదల చేయడం అభినందనీయమన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు చేపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉన్న 7,244 క్లస్టర్ల పంచాయతీ విధానాన్ని రద్దు చేసి ప్రతి గ్రామ పంచాయతీని స్వతంత్ర పరిపాలనా యూనిట్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. ఐదు గ్రేడ్లుగా ఉన్న పంచాయతీలను మూడు గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు 359 పునర్వ్యవస్థీకరించిన పంచాయతీలకు పీడీ పోస్టులు కల్పించినట్లు వివరించారు.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పదోన్నతుల విషయంలోనూ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 10 వేల మందికిపైగా ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించడంతో పాటు 42 మంది ఎంపీడీవోలకు కూడా పదోన్నతులు ఇచ్చినట్లు యార్లగడ్డ పేర్కొన్నారు.
జల్ జీవన్ మిషన్ అమలును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం 95.44 లక్షల నీటి కనెక్షన్లు కల్పించే లక్ష్యానికి గడువును 2028 జులై 30 వరకు పొడిగించిందని తెలిపారు.
గన్నవరం నియోజకవర్గంలోని 84 గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని యార్లగడ్డ సభ దృష్టికి తీసుకెళ్లారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రావాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీల వాటాతో పాటు సీఆర్‌డీఏ నుంచి పంచాయతీలకు రావాల్సిన వాటా నిధులు కూడా అందడం లేదని పేర్కొన్నారు. వీటిని వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.
యార్లగడ్డ ప్రస్తావించిన అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, ఆయన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చార్జీల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు రావాల్సిన వాటాపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెప్పించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సభ్యుల సూచనలు, సలహాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

