చెత్త నుంచి విద్యుత్.. విజయవాడలో VMC కొత్త అడుగు
గుంటూరులోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించిన వీఎంసీ అధికారులు... వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి విద్యుత్‌గా మార్చే విధానంపై అధ్యయనం... విజయవాడలోనూ ఇలాంటి ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశం...

విజయవాడ, ఆగస్టు 20: విజయవాడ నగరంలో చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా గుంటూరులోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు.
ప్లాంట్‌లో రోజువారీగా సేకరించే వ్యర్థాలను ఏ విధంగా శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తున్నారు, వాటి నుంచి విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అనే అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాల నిర్వహణ నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకు అనుసరిస్తున్న ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.
విజయవాడ నగరంలో రోజువారీగా వెలువడుతున్న చెత్తను సమర్థంగా నిర్వహించడంతో పాటు దానిని ఉపయోగకరమైన ఇంధన వనరుగా మార్చే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. గుంటూరు తరహాలో విజయవాడలోనూ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.

