అన్నప్రసాదం నాణ్యతపై ప్రత్యేక దృష్టి!
అన్నప్రసాద తయారీ, పంపిణీ వ్యవస్థల పటిష్టతకు చర్యలు... ఆధునిక యంత్రాలతో వంటశాల అభివృద్ధికి కార్యాచరణ... నాణ్యత, పరిశుభ్రతలో రాజీ వద్దు: ఈవో శీనా నాయక్...

విజయవాడ, నవంబర్ 5: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అన్నప్రసాద తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత, పంపిణీ ఏర్పాట్లను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు. గురువారం ఈవో ఛాంబర్లో కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని అక్షయ పాత్ర విభాగం అనుసరిస్తున్న ఆధునిక వంట విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పంపిణీ వ్యవస్థలపై చర్చించారు. నిత్యం ఇంద్రకీలాద్రికి తరలివచ్చే వేలాది మంది భక్తులకు రుచికరమైన, వేడి అన్నప్రసాదాన్ని వేగంగా అందించేందుకు అధునాతన యంత్రాల వినియోగం, వంటశాల ఆధునీకరణకు సంబంధించిన కార్యాచరణపై సమీక్షించారు. శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్నప్రసాద తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. వంటశాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు రద్దీ సమయాల్లో క్యూలైన్లలో ఉన్న భక్తులకు సైతం వేడి అన్నప్రసాదం సకాలంలో అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుతం అన్నప్రసాద తయారీకి అవుతున్న ఖర్చును ఆధునిక వంటశాల విధానంలో అయ్యే ఖర్చుతో పోల్చి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో హరే కృష్ణ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ హరి, దేవస్థాన అధికారులు సుధారాణి, చంద్రశేఖర్, ఏఈవో రమేష్‌బాబు, ఈఈ రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

