గుడివాడలో కూటమి విజయంపై వెనిగండ్ల రాము ధీమా!
పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే... కూటమి ఐక్యతే తమ ప్రధాన బలమని వెల్లడి... వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్య...

గుడివాడ, నవంబర్ 5: గుడివాడ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పలు గ్రామాల్లో పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించిన ఆయన పోలింగ్ కేంద్రాల సమీపంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల స్పందన, పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఈ పర్యటనలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరమన్నారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడిన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. మూడు పార్టీల ఐక్యతే తమ ప్రధాన బలమని వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని విధంగా ప్రజా తీర్పు ఉండబోతోందని ఎమ్మెల్యే రాము ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ, కూటమి శ్రేణుల సమష్టి కృషితో గుడివాడ నియోజకవర్గంలో కూటమి విజయపతాకం ఎగురవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

