నవంబర్ 11న దుర్గమ్మకు గాజుల అలంకరణ!
కార్తీక మాస ప్రత్యేక పూజలకు ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు... నవంబర్ 20 నుంచి భవానీ దీక్షాధారణలు.. డిసెంబర్ 24న కలశజ్యోతి మహోత్సవం... భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఈవో శీనా నాయక్ ఆదేశాలు...

విజయవాడ, నవంబర్ 5: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మకు నవంబర్ 11న భగినీ హస్తభోజనం పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష గాజుల అలంకారోత్సవం నిర్వహించనున్నారు. కార్తీక మాస ప్రత్యేక పూజలు, గాజుల అలంకరణ, వార్షిక భవానీ దీక్ష ఉత్సవాల ఏర్పాట్లపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ గురువారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈవో సూచించారు. ఆకాశదీపం, నిత్య అభిషేకాలు, బిల్వార్చనలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం వంటి కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా నవంబర్ 11న అమ్మవారి గాజుల అలంకార దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రసాద వితరణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. భవానీ దీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు నవంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షాధారణలు, డిసెంబర్ 24న నిర్వహించే కలశజ్యోతి మహోత్సవం, డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు జరిగే దీక్షా విరమణల ఏర్పాట్లపైనా ఈవో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భవానీ భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కేశఖండనశాలలు, స్నానఘట్టాలు, తాగునీరు, నిరంతర అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాల నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హోమగుండాల వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఇంజినీరింగ్, భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి విభాగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య, డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఈఈ రమాదేవి, ఏఈవోలు చంద్రశేఖర్, సుధారాణి, రమేష్‌బాబు, గంగాధర్, తిరుమలేశ్వరరావు, లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
