సామాజిక మాధ్యమాల్లో దుర్గమ్మ దసరా వైభవం!
15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు నమోదు... దేశ విదేశాల్లోని భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి అలంకార దర్శనాలు... వివరాలు వెల్లడించిన ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్...

విజయవాడ, నవంబర్ 5: ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందాయి. అమ్మవారి దివ్య అలంకారాలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు దేశ విదేశాల్లోని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 11 నుంచి 25 వరకు 15 రోజుల వ్యవధిలో దేవస్థానం సామాజిక మాధ్యమాల్లో మొత్తం 2.29 కోట్ల వీక్షణలు నమోదైనట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ వెల్లడించారు. దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం చేపట్టిన డిజిటల్ ప్రచారానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. ఫేస్‌బుక్‌లో 50 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 42.5 లక్షలు, యూట్యూబ్‌లో 25.7 లక్షలకు పైగా వీక్షణలు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా అమ్మవారి రోజువారీ విశేష అలంకార దర్శనాలు, శతచండీ యాగం, లక్ష కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను లక్షలాది మంది వీక్షించారని వివరించారు. ఒక్కో అలంకార ప్రత్యక్ష ప్రసారానికి సగటున 33 వేల నుంచి 57 వేల వరకు వీక్షణలు వచ్చినట్లు పేర్కొన్నారు. నగరోత్సవ ఊరేగింపులో గిరిజన ధింసా నృత్యాలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, దసరా కళావేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు, కృష్ణానదిలో పవిత్ర నవహారతులు, తెప్పోత్సవం వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షించాయని తెలిపారు. ప్రత్యక్షంగా ఆలయానికి రాలేని భక్తులు డిజిటల్ వేదికల ద్వారా అమ్మవారి దర్శనాలు, పూజా కార్యక్రమాలను వీక్షించే అవకాశం పొందారన్నారు. భక్తులకు దేవస్థాన విశేషాలను మరింత చేరువ చేసేందుకు యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ చానల్, ఎక్స్, థ్రెడ్స్, టెలిగ్రామ్ వంటి అధికారిక సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ ప్రసార, పత్రికా మాధ్యమాలతో పాటు డిజిటల్ వేదికల ద్వారా ఆలయ సమాచారం, ప్రత్యేక పూజలు, ఉత్సవ విశేషాలను ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్పష్టం చేశారు.
