తేలప్రోలులో టీడీపీలోకి చేరికలు!
సర్పంచి అభ్యర్థిగా ఉయ్యూరు దీపికా రెడ్డి పేరు ప్రకటన... కూటమి మద్దతుతో బరిలోకి దీపికా రెడ్డి... విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే యార్లగడ్డ...

విజయవాడ, నవంబర్ 14: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన ఉయ్యూరు మురళీమోహన్ రెడ్డి, బురముక్కల ధీరజ్ రెడ్డి, పంచకర్ల పవన్ నాయుడు, వింత అనిత్ రెడ్డి తదితరులకు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తేలప్రోలు సర్పంచి అభ్యర్థిగా ఉయ్యూరు మురళీమోహన్ రెడ్డి సతీమణి ఉయ్యూరు దీపికా రెడ్డి పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలుస్తారని వెల్లడించారు. గ్రామంలో నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలకు తావులేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని యార్లగడ్డ సూచించారు. వ్యక్తిగత అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తేలప్రోలులో నాయకుల చేరికలు, సర్పంచి అభ్యర్థి ప్రకటనతో గ్రామ రాజకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.

