గుడివాడలో రూ.5.80 కోట్లతో 16 సీసీ రోడ్లు
మూడు వార్డుల్లో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన… 40 ఏళ్ల తర్వాత సాయినగర్‌లో రోడ్డు నిర్మాణం.. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు… ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడి…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, అక్టోబర్ 10: గుడివాడ పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. శనివారం పట్టణంలోని 26, 29, 30వ వార్డుల్లో రూ.5.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 16 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 26వ వార్డు సాయినగర్‌లో రూ.95 లక్షలు, 29వ వార్డు బేతవోలు శ్మశానం సమీపంలో రూ.85 లక్షలతో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే 30వ వార్డు ధనియాలపేట, న్యూ కాలనీల్లో రూ.4 కోట్లతో 14 సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. స్థానిక మహిళలు, ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ సందర్భంగా సాయినగర్‌లో విద్యుత్ స్తంభాల సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.బుధవారం నాటికి నివేదిక సమర్పించాలని సూచించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత తమ కాలనీలో రహదారి నిర్మాణం

చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ధనియాలపేటలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను వివరణ కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోని కాలనీల అభివృద్ధే తన ప్రాధాన్యతని పేర్కొన్నారు. ధనియాలపేటలోనే సుమారు రూ.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కాలనీల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోనిప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

