తీవ్రవాదిని విచారించినట్లు ప్రశ్నించారు!
పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం… ముద్రగడ అంత్యక్రియల కేసులో కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు హాజరు… ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.. న్యాయపోరాటం చేస్తానని స్పష్టం…

కాకినాడ, నవంబర్ 10 : తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా భయపడేది లేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తానని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో మంగళవారం కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను అంతర్జాతీయ తీవ్రవాదిని విచారించినట్లుగా ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. తనపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని, పోలీస్ స్టేషన్లకు వెళ్లడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే విషయంలో ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని అంబటి ఆరోపించారు. పోలీసుల గౌరవ వందనం అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేసినప్పటికీ అధికారులు అందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గౌరవించే క్రమంలోనే తాము అభ్యంతరం తెలిపామని వివరించారు. మరోవైపు ముద్రగడ అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులను అడ్డుకోవడంతో పాటు సిబ్బందిని నెట్టివేశారనే ఆరోపణలపై అంబటి రాంబాబుతోపాటు పలువురిపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసులు జారీ చేయడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులను కేసులతో వేధిస్తున్నారని అంబటి ఆరోపించారు. తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
