లారీ ఢీకొని కారు నుజ్జునుజ్జు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
నెల్లారుగూడెం వద్ద కారును ఢీకొట్టిన లారీ… జగ్గయ్యపేట సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం… కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు…

విజయవాడ, అక్టోబర్ 31: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట సమీపంలోని నెల్లారుగూడెం వద్ద హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు కారు భారీగా ధ్వంసమైనప్పటికీ అందులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

