అనుమతి రవాణాకేనా?.. తవ్వకాలకూ ఉందా..!
▪️ పవిత్ర సంగమంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై భిన్న వాదనలు ▪️ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఐడబ్ల్యూఏఐ లేఖతో కొత్త ప్రశ్నలు ▪️ అసలు చట్టబద్ధ అనుమతులేంటి?.. అధికారులు స్పష్టత ఇవ్వాలంటున్న స్థానికులు

ఇబ్రహీంపట్నం: పవిత్ర సంగమం ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించిన అనుమతులపై వివాదం మరింత ముదురుతోంది. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ పీడీఎఫ్ ఇప్పుడు పలు ప్రశ్నలకు దారితీస్తోంది. ఆ పత్రం జలమార్గంలో నౌకలు, రో-రో కార్యకలాపాల నిర్వహణకు సంబంధించినదా? లేక డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలకు కూడా అనుమతిగా పరిగణించవచ్చా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అవుతున్న పత్రం సారాంశం ప్రకారం జాతీయ జలమార్గాల్లో అంతర్గత జల రవాణా నౌకలు, రో-రో కార్యకలాపాలకు ఐడబ్ల్యూఏఐ నుంచి ప్రత్యేక ఎన్‌ఓసీ అవసరం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఐడబ్ల్యూఏఐ మార్గదర్శకాలను పాటించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఇతర సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అన్ని చట్టబద్ధ అనుమతులు పొందాల్సిన బాధ్యత ఆపరేటర్‌పైనే ఉంటుందని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పవిత్ర సంగమంలో డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా జరుగుతున్నట్లు చెబుతున్న ఇసుక తవ్వకాలకు ప్రత్యేకంగా ఏ శాఖ అనుమతి ఇచ్చింది? మైనింగ్, పర్యావరణ, జలవనరులు తదితర సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? ఐడబ్ల్యూఏఐ పత్రాన్నే తవ్వకాలకు ప్రామాణికంగా చూపుతున్నారా? అనే ప్రశ్నలకు అధికారిక సమాధానం రావాల్సి ఉంది.
అధికారులు అనుమతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఏ కార్యకలాపానికి ఏ అనుమతి ఉందో సంబంధిత పత్రాలతో బహిర్గతం చేస్తేనే వివాదానికి తెరపడే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పీడీఎఫ్ అసలుదనం, పూర్తి పత్రంలోని షరతులు కూడా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

