ఒంటరి మహిళకు జీవనాధారం.. అండగా YNR చారిటీస్
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రమణకు ఉపాధి కల్పించేలా టిఫిన్ బండి అందజేత... సాయం కోసం సంప్రదించగానే స్పందించిన YNR చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్... చేతికి సాయం కాదు.. చేతినిండా పని కల్పించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమం...

గన్నవరం, ఆగస్టు 27: ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళకు స్వయం ఉపాధి కల్పిస్తూ YNR చారిటీస్ అండగా నిలిచింది. గన్నవరం నియోజకవర్గంలోని ఎనికెపాడు గ్రామం కేవీఆర్ కాలనీ 11-12లో నివాసముంటున్న గోందేళ్ల రమణ భర్త దుర్గారావు మృతి చెందడంతో కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
YNR చారిటీస్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న రమణ సంస్థ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్‌ను సంప్రదించి తన పరిస్థితిని వివరించారు. స్పందించిన ఆయన రమణకు తాత్కాలిక ఆర్థిక సహాయం చేయడం కంటే సొంతంగా ఉపాధి పొందే మార్గం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం YNR చారిటీస్ తరఫున ఆమెకు టిఫిన్ బండిని అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అవసరంలో ఉన్నవారికి ఉపాధి అవకాశాన్ని కల్పించడం ద్వారా వారు స్వయం సమృద్ధితో జీవించేలా చేయడమే తమ సేవా కార్యక్రమాల ఉద్దేశమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యలమంచిలి సామ్రాజ్యమ్మ, YNR చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్, యలమంచిలి వాసు, వెల్లంకి రాజా, మధు బోసు, దాసరి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

