ఈ విజయం ఉయ్యూరు ప్రజలకే అంకితం!
గెలిచిన కౌన్సిలర్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధుల బాధ్యత... నూతన కౌన్సిలర్లను అభినందించిన మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్...

ఉయ్యూరు, నవంబర్ 6 : ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పట్టణ ప్రజలకే అంకితం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు చలమలశెట్టి వెంకట రమణ, నేరుసు బాలకృష్ణ, మోటురు నాగేంద్ర, చింతయ్య, కొలగాని సునీత తదితరులు శుక్రవారం రాజేంద్రప్రసాద్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తమ విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌తో పాటు మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అభినందించి శాలువాలు కప్పి సత్కరించారు. ఎన్నికల్లో గెలవడం పదవిని పొందడం మాత్రమే కాదని, ప్రజల పట్ల మరింత బాధ్యత పెరిగినట్లేనని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, పదవిని ప్రజాసేవకు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తమ విజయానికి రాజేంద్రప్రసాద్, ఆయన సతీమణి యలమంచిలి భ్రమరాంబ అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఎన్నికల సమయంలో అందించిన మార్గదర్శకత్వం, కార్యకర్తలకు ఇచ్చిన భరోసా తమకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబ, జంపన శ్రీనివాస్, కౌన్సిలర్లు నేరుసు బాలకృష్ణ, మోటురు నాగేంద్ర, చింతయ్య, చలమలశెట్టి వెంకట రమణ, కొలగాని సునీత, కొలగాని సాంబశివరావు, బాణావత్ రవి, దాసు శ్రీనివాసరావు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

