రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు!
రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి... ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రారంభం... భారీ భద్రత నడుమ లెక్కింపు.. తొలి ఫలితానికి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం...

అమరావతి, నవంబర్ 6 : ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 365 కేంద్రాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ విధుల కోసం 11 వేల మంది సూపర్వైజర్లు, 28,500 మంది సిబ్బందిని నియమించినట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కనీసం నాలుగు గంటల తర్వాత తొలి ఫలితం వెలువడే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

