సరస్వతి పుత్రుడిగా వసంత వెంకట కృష్ణప్రసాద్..!
నేతాజీ సైనిక్ స్కూల్ అభివృద్ధికి రూ.25 లక్షల భారీ విరాళం చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి మరో రూ.5 లక్షల సాయం విద్యాభివృద్ధికి అండగా మరోసారి దాతృత్వం చాటుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్

విజయవాడ క్రైమ్ ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): చదువుల తల్లి రుణం తీర్చుకునేలా విద్యారంగానికి అండగా నిలుస్తూ మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం ఆధ్వర్యంలో, రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తింపుతో నిర్వహిస్తున్న నేతాజీ సైనిక్ స్కూల్ అభివృద్ధికి రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. విలువిద్యను ప్రోత్సహించేందుకు చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి మరో రూ.5 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. కేతనకొండ నేతాజీ సైనిక్ స్కూల్ ప్రాంగణంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వసంత వెంకట కృష్ణప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశసేవకు సిద్ధం కావాలి ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సైనిక్ స్కూల్స్‌లో విద్యతో పాటు శారీరక, మానసిక సామర్థ్యాలు పెంపొందుతాయని, తద్వారా భవిష్యత్తులో దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాములయ్యేందుకు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దేశ రక్షణలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో కష్టపడి చదవడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మరిన్ని సైనిక్ స్కూల్స్ అవసరం రాష్ట్రంలో మరిన్ని సైనిక్ స్కూల్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సైనిక శిక్షణ అందుబాటులోకి వస్తే మరింత మంది యువత దేశ రక్షణ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుందన్నారు. కేతనకొండ నేతాజీ సైనిక్ స్కూల్ మరింత అభివృద్ధి చెందేందుకు తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విజన్–2047 లక్ష్యంగా ముందుకు సాగాలి స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో స్వర్ణాంధ్ర సాధనకు అడుగులు వేయాలని, విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. సైనిక్ స్కూల్ అభివృద్ధికి రూ.25 లక్షలు, ఆర్చరీ అకాడమీకి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించిన వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

