చట్టాలపై చైతన్యం.. ప్రతిభకు ప్రోత్సాహం
ఎదురుమొండి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పోలీసుల అవగాహన... బాల్య వివాహాలు, పోక్సో, 112, ఈగల్–శక్తి టీమ్స్ సేవలపై వివరణ... రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన నలుగురు విద్యార్థులకు రూ.10 వేల నగదు ప్రోత్సాహం...

మచిలీపట్నం, ఆగస్టు 25: విద్యార్థులు తమ హక్కులు, రక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలు, పోలీసు సేవలపై అవగాహన పెంచుకోవాలని అవనిగడ్డ సీఐ జి. యువకుమార్ సూచించారు. చైతన్యం కార్యక్రమంలో భాగంగా నాగాయలంక మండలం ఎదురుమొండి జెడ్పీ హైస్కూల్లో సోమవారం విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ యువకుమార్, నాగాయలంక ఎస్సై కె. రాజేష్ విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణకు ఉన్న చట్టాలు, పోక్సో చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 హెల్ప్‌లైన్ సేవలను ఎలా వినియోగించుకోవాలో తెలియజేశారు.
అలాగే మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ టీమ్ పాత్ర, మహిళలు, బాలికల భద్రత కోసం పనిచేస్తున్న శక్తి టీమ్స్ సేవలను వివరించారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందేందుకు ఉపయోగపడే SOS యాప్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఇదే కార్యక్రమంలో ఎదురుమొండి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థినీ, విద్యార్థులు సాఫ్ట్‌బాల్, ఖోఖో క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై సీఐ యువకుమార్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహిస్తూ తన వంతుగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నలుగురికి మొత్తం రూ.10 వేల నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపుతూ పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను అభినందించారు.

