కుర్చీ కూడా కరువే..!
ఓపీ వద్ద గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి... వృద్ధులు, మహిళలు, చిన్నారులకు తప్పని తిప్పలు... కుర్చీలు, తాగునీరు, నీడ కల్పించాలని బాధితుల డిమాండ్...

అనకాపల్లి: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రాంతీయ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు కనీస వసతులు కరువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది రోగులు ఆసుపత్రిని ఆశ్రయిస్తుండగా, ముఖ్యంగా ఓపీ విభాగం వద్ద సరైన నిరీక్షణ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోగులు వాపోతున్నారు.
ఓపీ వద్ద రోగులు కూర్చునేందుకు అవసరమైన సంఖ్యలో కుర్చీలు లేకపోవడంతో జ్వరం, నీరసం, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన వారు సైతం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని చెబుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు కనీసం కూర్చునే అవకాశం కూడా లేక అల్లాడాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓపీ వద్ద రద్దీకి అనుగుణంగా కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, నీడ, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియా కల్పించాలని కోరుతున్నారు.
ఆసుపత్రి అధికారులు సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టి రోగులకు కనీస సౌకర్యాలు అందించాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

