వైద్యానికి భరోసా.. రూ.6.63 లక్షల సాయం!
బాధితుడికి అండగా ఎమ్మెల్యే సుజనా చౌదరి... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6.63 లక్షల ఎల్ఓసీ మంజూరు... బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన కూటమి నాయకులు...

విజయవాడ, నవంబర్ 14 : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం కోరిన వ్యక్తికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అండగా నిలిచారు. ఆయన చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.6.63 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ని శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. విజయవాడ 53వ డివిజన్ ప్రైజర్‌పేటకు చెందిన గండి చిన్ని (53) పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ (రక్తనాళాల సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరం కావడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య సహాయం మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జి దుర్బేసుల హుస్సేన్, 53వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సోంపాక చినబాబు కలిసి మంజూరైన ఎల్ఓసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

